శాంతమూ లేక ........
''స్పర్ధయా విద్యయేత్ ! అన్నారు పెద్దలు .
రాజకీయాలలో సినిమా రంగం లో రచనా వ్యాసంగం లో పర్వాలేదు . అది ఆరోగ్యకరమయిన పోటీ
కానీ చుట్టాలలో స్నేహితులతో చివరికి అన్న దమ్ములలో అక్క చెల్లెళ్ళల్లో కూడా పోటీ తత్వం చూసి ఆశ్చర్యమేస్తుంది .
''నీ కన్నా నేను గొప్ప !నీకేమి తెలియదు అన్నట్లు వ్యవహరించే వాళ్ళను చూస్తే,వాళ్ళెంత దగ్గరి వాళ్ళయినా దూరముండాలి. అనిపిస్తుంది
వాళ్ళు అన్నది చెప్పినది అవతలి వారు కరెక్ట్ చేద్దామనుకున్నా వినరు.
ముర్ఖం గా వాదిస్తారు . ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి గొడవ లోకి దిగిపోవడం అక్కరలేని రాద్ధాంతం. వరస వావి ఏమి ఉండనంత గా అవతలి వారు మన కన్నా పెద్దవాళ్ళు అనుభవమున్నవాళ్ళు వాళ్ళతో వాదనలెందుకు అన్న విచక్షణ ఉండదు. అటువంటి వివాదాలు.మన మనశ్శాంతి సహనం పోగొట్టే వరకు సాగుతుంది.
గట్టిగా నోరుమూయించేలా అన్నామనుకోండి! ఏడుపు అస్త్రం ఉందనే వుంది
ఇటువంటి వాళ్ళ చెలిమి చాల కష్టం.తమ పట్ల ఉన్న సానుభూతి నో ప్రేమనో అడ్డు పెట్టుకుని సాధిస్తే ఎవరికయినా ఒళ్ళు మండుతుంది.
'నోరు మంచిదయితే ఊరు మంచిదనే' సామెత ఉండనే వుంది.
ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది !
స్నేహితుల్లో ఇలాంటి వాళ్ళుంటే వదిలేసుకోవచ్చు !
కానీ దగ్గ్గరి వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళుంటే ఏమీ చేయలేని పరిస్థితి !మతి తప్పిన కాకుల రొదలో మౌనమే మంచిది ,
తివిరి ఇసుమున తైలం దీయవచ్చు
జవిరి కుందేటి కొమ్ముసాధించవచ్చు
చేరి మూర్ఖులమనసు రంజింపరాదు
అన్నట్లు వాళ్ళంతట వాళ్ళు అందరితో
సామరస్యం గా మెలగాలి కానీ ఎవరు మార్చగలరు?
నిజానికి తెలివి సంస్కారం వున్నవాళ్లు గుంభనగా ఉంటారు
వాళ్ళ గురించి లోకం చెప్పుకోవాలి కానీ వాళ్ళు చెప్పుకోరు
ఎంతసేపూ 'నేను అది! నేను ఇది ' అని చెప్పుకోవడం కొందరికి అలవాటు
అది వాళ్ళకే ఆనందం వినే వాళ్ళకి పరమ బోర్!ఆడేందుకు అర్ధం కాదో!
లోగడ మా నాన్న గారు ఇలా మాట్లాడే వాళ్ళని చూసి నేను అరటి పండు తిన్నాను అని ఒక నలభయ్ సార్లు చెప్పాడనుకో !మనకేమయిన కడుపు నిండుతుందా ! అని నవ్వే వారు. అలాగ మన లైఫ్ స్టయిలే మనకే హేపీ !
అవన్నీ అవతలివారికి సోది అది గ్రహించుకోవాలి మనమే !
ఇది అందరి మీద చిరుబురు లాడుతూ అందరితోనూ గొడవలు పెట్టుకునే వారికీ ఒక సూచనా
ఒక పేపర్ తీసుకుని ఇంత వరకు ఎందరితో వాగ్వివాదాలు అయ్యాయో!
ఎందుకయ్యాయో ! ఎవరితో అయ్యాయో ! వారితో సంబంధ బాంధవ్యాలుండాలో అక్కర్లేదో ! రాసుకోండి.
మొత్తం మీ చుట్టూ ఉన్నవారితోమీకు మనసుకి దగ్గరగా ఎందరున్నారో గమనించండి.కనీసం చుట్టాలు స్నేహితులు రక్త సంబంధీకులు కాలనీ ఫ్రెండ్స్ ఇలా అన్ని కేటగిరీ లలో మీకు కనీసం ఒక పదిమందైన మీ మనసుకి దగ్గరగా వున్నారా గమనించండి ఉంటె పర్వాలేదు లేకుంటే మీరు చాలా మారాలి.
మీకు చాల మంది దూరం ఆయె ప్రమాదముంటుంది,అలాగే మీరు నోరు జారకుండా కాపాడుకునే బాంధవ్యాలు కూడా లెక్కపెట్టుకోండి.
వయసు శరీరానికొస్తుంది కానీ బుద్ధి కి కాదు.
వయసు తో పెద్దరికాలు గౌరవాలు సంస్కారాలు రావు. అవి మన ప్రవర్తన బట్టి వస్తాయి. ఎదురు గా కానీ చాటుగా కానీ మన గురించి చెప్పుకునేలా ఉంటె
మనకే అగౌరవం! చాల వాటికీ మౌనం చిరునవ్వే మందు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి